‘నా రాజకీయ యాత్రను ప్రారంభించేందుకు సోమవారం కొండగట్టు అంజన్న దగ్గరికి వెళ్తున్నా.’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచే ఆయన తెలంగాణలో మూడు రోజుల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వివరాలను తెలుపుతూ జనసేన మీడియా విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పవన్, ఈ ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరనున్నారు. ఇప్పటికే జనసేన కార్యాలయం వద్దకు పవన్ అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కొండగట్టుకు చేరుకోనున్న పవన్, స్వామి దర్శనానంతరం కరీంనగర్ చేరుకోనున్నారు.
కాగా రాత్రికి అక్కడే బసి చేసి, ఆపై రేపు ఉదయం 10.4కు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రికి కొత్తగూడెం చేరుకుని అక్కడ బస చేస్తారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు వెళ్లి, మధ్యాహ్నం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తారు.