ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ తమ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసినట్లు ప్రకటించిన అనంతరం సోమవారం రాత్రి జనసేన అధినేత పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ స్పందనతో జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో వెంకయ్యనాయుడుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ అధిష్టానానికి సైతం పవన్ అభినందనలు తెలియజేశారు.
అయితే పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో.. ”ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తెలుగు బిడ్డ గౌరవనీయులైన వెంకయ్య నాయుడుకి నా తరపున జనసేన శ్రేణుల తరపున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవమున్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా తెలుగు వారికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. వెంకయ్య నాయుడుని అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను. -జైహింద్“ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం పవన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారు. 2019 లోగా చేయాల్సిన సినిమాలన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ సినిమా తెరకెక్కుతుంది. తదుపరి సినిమాల కోసం కూడా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాడు పవన్.