కరీంనగర్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటించారు. కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో మూడు జిల్లాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్, ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ… ఆంధ్రా నాకు జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయుడు నన్ను కాపాడారని పవన్ గుర్తుచేశారు. తెలంగాణ నేలతల్లికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని పవన్ అన్నారు. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.
2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఉన్నానన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై పోరాటం, పర్యావరణాన్ని పరిక్షించే విధానాన్ని ప్రకటిస్తాన్నారు. జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఆయన మాట్లాడుతూ….మార్చి 14లోపు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. విధానాలనే ప్రశ్నిస్తా, వ్యక్తిగతంగా ఎవరితో గొడవలేదని పవన్ చెప్పారు. ప్రేమ ముందు ద్వేషం చాలా చిన్నదని, నన్ను ద్వేషించేవారిని పట్టించుకోనన్నారు. నాకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. నా సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిచ్చానని గుర్తుచేశారు. భాషను, యాసను గౌరవించే సంప్రదాయం ఉండాలన్నారు.
సంస్కృతులను కాపాడే సమాజం కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు. ప్రాంతీయవాదంలో పడి జాతీయవాదాన్ని విస్మరించొద్దన్నారు. దేశ విభజన అనంతరం హిందూరాజ్యంగా ప్రకటించే అవకాశం ఉన్నా.. నాటి నేతలు దూరదృష్టితో లౌకికరాజ్యంగా ప్రకటించారని పవన్ పేర్కొన్నారు. ‘‘కుల, మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలి. అధికారం కొన్ని కులాలకే పరిమితమైంది. అన్ని కులాలకు సీట్లివ్వడమే సామాజికన్యాయం కాదు. అన్ని కులాల వారికి ఆర్థిక భద్రత అవసరం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి. అవినీతిని జనసేన దరిచేరనీయదు’’ అని పవన్ స్పష్టం చేశారు.