పవన్ కల్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన.. జల్సా,అంత్తారింటికి దారేది, సినిమాలు భారీ విజయన్ని అందుకున్నాయి. అయితే ఇదే కలయికలో మరోసారి సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమలోని క్రేజీ కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే గట్టి నమ్మకం , ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఉంది. అందుకే వీరి కలయికలో రాబోతున్న సినిమా పై భారీ స్థాయి అంచనాలున్నాయి.
అయితే వీరి కాంబినేషన్లో రాబోయే ఈసినిమా బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతున్న చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయం ఖాయమైపోయింది. ఎందుకంటే ఈ చిత్రం హిందీ వెర్షన్ రైట్స్ ద్వారా నిర్మాతలకు ఇప్పటికే 11 కోట్ల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదేమీ కేవలం థియేట్రికల్ హక్కుల కోసం మాత్రమే కాదు. హిందీ వెర్షన్ కు సంబంధించిన శాటిలైట్.. డిజిటల్ హక్కులు కూడా కలిపి 11 కోట్ల రూపాయల మొత్తాన్ని పవన్-త్రివిక్రమ్ మూవీ వసూలు చేయగలిగింది.
సాధారణంగా బాలీవుడ్లో మురుగదాస్ వంటి ఆదరణ ఉన్న దర్శకుల సినిమాలకే ఈ రేటు పలుకుతుందట. లేదంటే నాలుగైదు కోట్లతో సర్దుకోవలసి వస్తుందని చెబుతున్నారు. అలాంటిది పవన్ సినిమాకి ఈ స్థాయి రేటు రావడం చెప్పుకోదగిన విశేషమేనని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. శంషాబాద్ సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. మరో రెండు వారాల పాటు అక్కడే షూటింగ్ జరపనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంటుందని అంటున్నారు.