నేను ఆమరణ దీక్ష చేస్తా..

262
- Advertisement -

గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సమస్యలపై పోరాటం చేయడం అంటే తనకు ఇష్టమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు.

మరోవైపు పెద్ద ఎత్తున జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అక్కడకు వ‌చ్చారు. కాగా, జనసేన యువజన విభాగానికి నేతాజీ యువసేనగా, మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మి వీర మహిళా సేనగా, విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ విద్యార్థి విభాగంగా పేర్లు పెడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కేంద్ర ప్ర‌భుత్వానికి అర్థ‌మ‌య్యేలా తాను మొద‌ట‌ ఇంగ్లిషులో మాట్లాడ‌తానని, త‌న‌కు భ‌యం లేదని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తెలుగువారు టంగుటూరి ప్ర‌కాశం వార‌సులని, వారికి ఎలాంటి భ‌యం లేదని అన్నారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి విన‌ప‌డేలా ప్ర‌శ్నిద్దామ‌ని వ్యాఖ్యానించారు. ఈ రోజు గుంటూరులో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ… నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం అన్యాయం చేస్తూనే ఉంద‌ని అన్నారు.

Pawan Kalyan Speech in Jana Sena Formation Day

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కారణం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. “ఏ పరిస్థితుల్లో నేను 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చాను. మీకు పదవులు అప్పజెప్పి మీ కాళ్లతో తొక్కించుకోవడానికా?.. మీతో, మీ పిల్లలతో తొక్కించుకోవడానికా? ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తోంటే కంచె చేను మేస్తోంటే కాపరి ఏం చేయగలడు అనే సామెత గుర్తొస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్ధృతంగా పోరాడాల్సి వస్తుంది. మేము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతాం జనసేన అధినేత అన్నారు.

“రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందని సామెత ఉంది. చంద్రబాబుకి ఎందుకు నేను సపోర్ట్ చేశానంటే విడిపోయిన రాష్ట్రంలో చాలా అనుభవజ్ఞులు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను టీడీపీకి మద్దతిచ్చాను. ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అసత్యాలు వినపడుతున్నాయి నాకు. మూడు మాటలు ఆరు అసత్యాలు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోందని, అలాగే వైసీపీ నాయకులు ప్రజల తరఫున నిలబడి టీడీపీని నిలదీస్తూ బలంగా పోరాడతారా అంటే వారు అసెంబ్లీకే వెళ్లడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి అయితేగానీ జగన్ అసెంబ్లీకి రారా?.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడా.. అయినా పోరాటం చేయడానికి ముందుకు రాలేదా.. సమస్యలపై పోరాడాలంటే ముఖ్యమంత్రి కావాలా.. ఈ విధానం వైసీపీ నేతలు తెలుసుకోనంత కాలం ప్రజల సమస్యలు తీర్చాలన్న లక్ష్యం నేరవేరదు’ అని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan Speech in Jana Sena Formation Day

ఏపీ కోసం తాను ప్రాణత్యాగానికి అయినా సిద్ధమని.. జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న రోజు నుంచి ఎప్పుడైనా తాను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమని పవన్ చెప్పారు. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ బలిదానాలు చేయొద్దు… అవసరమైతే పవన్ కల్యాణే బలిదానం చేస్తాడని అన్నారు. ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగిస్తూ యువ నాయకత్వం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే యువతను పోరాటాలకు రోడ్లపైకి రమ్మని పిలవను అని చెప్పారు.

ఏపీ ప్రయోజనాల కోసం తాను దీక్షకు సైతం సిద్ధమని పవన్ ప్రకటించారు. `అవసరమైతే…అవసరమైతే ఏమిటి అవసరం పడుతుంది…నేను ఆమరణ దీక్ష చేస్తా` అని పవన్ కల్యాణ్ అన్నారు. `ప్రత్యేక హోదాపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం చెప్పి తీరాలి. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేసి తీరాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాను బలిదానానికి సిద్ధం` అని పవన్ పునరుద్ఘాటించారు. భారత్ మాతాకి జై నినాదంతో తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ ముగించారు.

కాగా జనసేన సభ్యత్వం గురించి ప్రకటన చేశారు. `జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే 9394022222 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మీకు జనసేనలో సభ్యులవుతారు. `ఓటు బ్యాంక్ అంటే నాకు నచ్చదు. మీరంతా నా కుటుంబం. కుటుంబం అంటే సంపద కాదు. రాజకీయం నేను కోరుకున్నది కాదు. జరిగిందంతే. ప్రజలను ఓట్ బ్యాంక్ అనడం తనకు ఇష్టం ఉండదు. జీవం ఉన్న మనుషులు బంగారంలా చూడాలి` అని పవన్ చెప్పారు.

- Advertisement -