జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి బీజేపీపై ట్వీట్టాస్త్రాన్ని ప్రయోగించాడు. భారతీయ జనతా పార్టీ వైఖరిని ఎండగడుతూ.. ఇటీవలే ఐదు అంశాలను ఉంచిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అందులోని మూడవ అంశం దేశభక్తి పై స్పందించాడు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా విభేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లడమే దేశభక్తి అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశభక్తి అనేది ఓ రాజకీయ పార్టీకి చెందిన అంశంగా ఉండకూడదని అన్నారు. దేశభక్తి అనేది మనిషిలో విలువలతో, మానవతతో కూడి ఉండే అంశమని అన్నారు.
దేశభక్తిపై అంశంపై స్పందిస్తూ.. పవన్ కొన్నినెల క్రితం ఢిల్లీలోని జేఎన్‌యూ లో జరిగిన విద్యార్ధుల ఘటనను ప్రస్తావించారు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ విధానాలను ఎవరయినా విభేదిస్తే అది యాంటీ-నేషనల్ కాదని పవన్ అన్నారు. తమకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వారిని మాటలను అధికార పార్టీ మొదట వినాలని, ఆ తరువాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూ స్టూడెంట్లను యాంటీ నేషనల్ వ్యక్తులుగా చిత్రీకరించారని, ఆ తరువాత వారు ఆ చర్యకు పాల్పడలేదని రుజువయిందని పవన్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ మీటింగ్‌లను జాతీయగీతంతో ఎందుకు ప్రారంభించబోవని, సినిమా థియేటర్‌లలో మాత్రమే పాడాలని ఎందుకు చెబుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఇప్పటికి మొన్న గోవధ, నిన్న రోహిత్ వేముల ఆత్మహత్య గురించి బీజేపీని నిలదీసిన పవన్.. నేడు మూడో అంశంపై స్పందించడంతో..ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది.
సారీ చెప్పిన పవన్..
భారతీయ జనతా పార్టీని నిలదీస్తూ మూడో అంశం గురించి ప్రశ్నించిన పవన్ కొద్ది సేపటి తర్వాత మరో ట్వీట్ చేశాడు. అదేంటంటే తన ఫాలోవర్స్‌కు సారీ చెప్పాడు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థుల సంఘనను ప్రస్తావించిన పవన్ అందులో జేఎన్‌యూ కు బదులు జేఎన్‌టీయూ అని పేర్కోన్నారు. దీంతో జేఎన్‌టీయూ అని పేర్కొన్నానని, దాన్ని సరిచేస్తున్నానని అది ‘జేఎన్‌టీయూ కాదు- ఢిల్లీలోని జేఎన్‌యూ’ అని పేర్కొన్నారు. రేపు తాను ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోస్ట్ చేస్తానని చెప్పారు. ఆఖరికి జై హింద్ అని పేర్కొన్నారు.