జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోకస్ తెలంగాణపై మళ్లిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో జనసేన కూడా పోటీలో ఉంటుందని, పవన్ ఇటీవల క్లారిటీ ఇవ్వడంతో తెలంగాణలో జనసేన పార్టీ ఎంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి తెలంగాణలో జనసేనను బరిలో నిలపాలని పవన్ గతంలోనే కసరత్తు చేశారు. కానీ ఏమైందో తెలియదు గాని మళ్ళీ ఆంధ్ర వరకే జనసేనను పరిమితం చేశారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఏపీలో జనసేన బలమైన పార్టీగా రూపు దిద్దుకుంది. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన గాలి విస్తారంగా వీచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా జనసేనను రంగంలోకి దించితే ఇక్కడి అభిమానుల నుంచి వచ్చే స్పందన ఏపీలో ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: June13:గ్రే హౌండ్స్ గురువు ఎన్ఎస్ భాటి వర్ధంతి
అయితే తెలంగాణలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటి అనే దానిపై ఇంకా క్లారిటీ లేనప్పటికి ఎన్నికల్లో పోటీ మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయింది. కాగా ఏపీలో జనసేన పార్టీ బిజెపితో పొత్తులో ఉంది. మరి ఈ దోస్తీ తెలంగాణలో కూడా కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఇక జనసేన ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమనే చెప్పాలి. ఇప్పటికే బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎంట్రీ ఆయా పార్టీల ఓటు బ్యాంక్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు తీవ్రంగా దెబ్బ తింటుంది. ఇక బిజెపి తో పొత్తు లేకపోతే ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా జనసేన సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలు బిఆర్‌ఎస్ కు మరింత మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పవన్ ఫోకస్ తెలంగాణపైకి మళ్లడంతో రాబోయే రోజుల్లో పవన్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: టి కాంగ్రెస్ లో ” డీకే పాలిటిక్స్ ” !