పవన్, చంద్రబాబు..ఉమ్మడి ప్రచారం?

25
- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఇక జనసేన అధినేత కూడా వారాహి యాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్ ను గద్దె దించే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు దోస్తీ కట్టిన సంగతి తెలిసిందే. అయితే మూడు పార్టీలు కలిసి అడపా దడపా బహిరంగ సభలు నిర్వహించడం మినహా కలిసి కలిసికట్టుగా ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయలేదు. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో కలిసి ప్రచారం చేసే దిశగా పవన్ చంద్రబాబు ప్రణాళికలు మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. .

ఈ నెల 10,11 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేయనునట్లు తెలుస్తోంది. ఆయా నియోజక వర్గాల్లో కలిసి రోడ్ షోలు కూడా నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. గత కొన్ని రోజులుగా పవన్ అనారోగ్యం కారణంగా ప్రచార కార్యక్రమాల్లో కొంత స్లో అయ్యారు. అయినప్పటికి అడపా దడపా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరికి వారు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల కూటమి ఇంపాక్ట్ దెబ్బ తినే అవకాశం లేకపోలేదు.

అందుకే ఇకపై పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు… ఇలా అన్నీ ప్రచార కార్యక్రమాలు కలిసే చేసేలా పవన్ చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరితో పాటు బీజేపీ నేతలు పాల్గొంటారా లేదా అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. బీజేపీ కూడా పొత్తులో ఉన్నప్పటికి టీడీపీతో కలిసి ప్రచారం చేయడంపై కొంత వెనకడుగు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీని ప్రచారంలో యాక్టివ్ చేసే దిశగా పవన్, చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమి తరుపున ఉమ్మడి ప్రచారానికి అధినేతలు రెడీ కావడంతో ఏపీ పాలిటిక్స్ మరింత రంజుగా మారనున్నాయి.

Also Read:2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

- Advertisement -