ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద ఊహించని వివాదం చెలరేగింది. ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఈఫిల్ టవర్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఈ నెల 5వ తేదీన ప్రముఖ ‘BAPS స్వామినారాయణ సంస్థ’కు చెందిన సాధువులు, ప్రతినిధుల బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. అయితే, ఈ హిందూ సాధువుల పర్యటన సమయంలో వారి నియమావళి లేదా అభ్యర్థనల పేరుతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని బాధ్యతల నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మహిళా ఉద్యోగులను పక్కన పెట్టడం తీవ్ర లింగ వివక్ష కిందకే వస్తుందని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈఫిల్ టవర్ వద్ద పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది యూనియన్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. పనివేళల్లో మహిళా ఉద్యోగులను అడ్డుకోవడం పట్ల నిరసన వ్యక్తంచేస్తూ వారు విధులను బహిష్కరించారు. సిబ్బంది ఆందోళనతో పర్యాటకుల భద్రత, నిర్వహణ దృష్ట్యా ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేయక తప్పలేదు. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మహిళా సిబ్బందిని విధులకు దూరంగా ఉంచాలంటూ తాము ఎలాంటి ఒత్తిడి తేలేదని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని BAPS సంస్థ ప్రారంభంలో ఖండించింది. అయితే పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఘటన వల్ల కలిగిన అసౌకర్యానికి గానూ BAPS సంస్థ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం వెలువడింది. ఫ్రాన్స్ సమానత్వ హక్కులు, లౌకిక విధానాలకు ఈ ఘటన భంగం కలిగించేలా ఉందనే విమర్శలు వ్యక్తమవడంతో పారిస్ మేయర్ తీవ్రంగా స్పందించారు. ఈఫిల్ టవర్ వద్ద అసలేం జరిగిందనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి మహిళా సిబ్బందిని తప్పించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read:ఆసీస్‌తో సిరీస్..అండర్-19 టీం

