సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం..

41
Errabelli Dayakar
- Advertisement -

పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి దశలవారీగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని చోక్లా తండా నుండి గురిమెల్ల వరకు 1 కోటి 75 లక్షల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. బయ్యారంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుని, గంథం పల్లిలో సీసీ రోడ్ల ను ప్రారంభించారు. అనంతరం కొత్త పేటలో చెక్ డ్యాంను ప్రారంభించి.. సాయంత్రం కాచన పల్లి పరిధిలోని రామన్నపేటలో బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రతి ఊరిలో సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై, తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో నేడు గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెబుతున్నారని, దీంతో వెంటనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని, సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ , అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -