పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని తేల్చిచెప్పింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఖవాజాకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని తేల్చడంతో కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవి నుంచి ఖావాజా వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీనియర్ మంత్రి అయిన ఖవాజా ప్రస్తుతం విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. అయితే కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడంతో పాక్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే పాక్ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇటీవలే అవినీతి ఆరోపణల కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్ ప్రధానిపదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్నవిషయం తెలిసిందే. కాగా..నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. అయితే ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటోంది.