ప్రేమించి పెళ్ళి చేసుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుందని మీరెప్పుడైనా అనుకున్నారా..? అసలు ప్రేమ పెళ్ళికి ఫైన్ ఏంటీ అనేగా మీ డౌట్. నిజానికి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలా కూడా జరుగుతుందా అని అవాక్కయ్యే సంఘటన ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) అక్షరాల రూ.17 లక్షల ఫైన్ వేసింది. అంతేకాకుండా ఆ జంటను మూడు నెలలపాటు గ్రామం నుంచి బహిష్కరించింది.
ఈ ఘటన దక్షిణ సింధ్ ప్రావిన్సు పరిధిలోగల కంధ్‌కోట్ కష్మోరే జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. దీనికి తోడు చిత్రంగా దీనికి ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. కష్మోరే జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అమ్మాయి ఇష్టంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అమ్మాయిని పెళ్లి చేసుకుని పరువు తీశాడనీ, ఆమె పుట్టింటివారు జిర్గాలో ఫిర్యాదు చేశారు. దీంతో జిర్గా న్యాయనిర్ణేతలు రూ. 17 లక్షల జరిమానా విధించారు.
న్యాయస్థానం తప్పనిసరి కట్టాల్సిందేనని చెప్పడంతో ఆయన ప్రేమ కోసం ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇదిలాఉండగా కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత నెలలో పాకిస్థాన్ ప్రభుత్వం జిర్గాల తీర్పులను చట్టబద్ధం చేసింది. దాంతో బాధితుడు జిర్గా తీర్పు ప్రకారం రూ. 17 లక్షల ఫైన్ చెల్లించక తప్పలేదని వాపోయాడు.