ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్ర సెట్‌ను కొందరు దుండగులు దహనం చేశారు. ప్రస్తుతం కొల్హాపూర్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ లో పద్మావతి చిత్ర షూటింగ్ జరుగుతోంది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంత మంది వ్యక్తులు పెట్రోల్ బాంబులు, రాళ్లతో సెట్‌కు వెళ్లి భద్రతా సిబ్బందిపై దాడి చేసి, లోపలికి ప్రవేశించారు. అనంతరం సెట్‌ను దహనం చేశారు. ఈ ఘటనలో ఒక గుర్రం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నిప్పంటించడానికి ముందు అక్కడి కార్లను కూడా ధ్వంసం చేశారు.
నెల రోజుల కిత్రం ‘పద్మావతి’ షూటింగ్ జైపూర్‌లో జరుగుతుండగా స్థానిక కర్ణిసేన సభ్యులు సెట్‌కు వెళ్లి భన్సాలీపై దాడి చేశారు. సినిమా షూటింగ్ ఆపాలని హెచ్చరిస్తూ దాడికి దిగారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో జైపూర్ లో షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రయూనిట్ పై రాజ్ పుత్ కర్నిసేన సభ్యులు దాడి చేశారు. పద్మావతి చరిత్రను వక్రీకరించారంటూ డైరెక్టర్ తో పాటు యూనిట్ సభ్యులపై దాడికి దిగారు. కాగా, ప్రస్తుతం జరిగిన దాడికి కారకులెవరన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. చిత్ర బృందం నుంచి బుధవారం ఉదయం చిత్ర బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కొందరు అనుమానితుల్ని అరెస్టు చేశారు.