రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న ప్రకృతి సేవకు హర్షించి హైదరాబాద్ కు వచ్చి మనసారా ఆశీర్వదించారు పద్మశ్రీ తిమ్మక్క. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న జోగినిపల్లిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవ్వాల ప్రగతి భవన్ కు వచ్చిన తిమ్మక్కను “తెలంగాణకు హరిత హారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమావేశ మందిరంలో” ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా సన్మానించారు. “వృక్షమాత” తిమ్మక్క తెలంగాణ ప్రజలందరికి స్పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మొక్కలు నాటడం అంటే కార్యక్రమం కాదని, మనల్ని, మన భవిష్యత్ తరాలను బ్రతికించే మార్గమని ముఖ్యమంత్రి అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని ప్రశంశించారు. తిమ్మక్క మరింత కాలం సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
అనంతరం తిమ్మక్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారు “హరిత హారం” చేపట్టడం ప్రకృతికి మేలు చేస్తుందన్నారు. స్వయంగా ప్రభుత్వమే చెట్లు నాటే కార్యక్రమానికి పూనుకోవడం. నిబద్ధతగా ప్రతియేటా మొక్కలు నాటడం, రక్షించడం లాంటి కార్యక్రమాలు కేసిఆర్ కి ప్రకృతిపై ఉన్న బాధ్యాతయుతమైన ఆలోచనకు తార్కాణమన్నారు. హరితహారంలో పండ్ల మొక్కలను నాటితే మనుషులకే కాకుండా జంతువులకు మేలు చేసినవారమవుతామన్నారు. అందుకు తాను పెంచిన పండ్ల మొక్కలను కూడా పంపిస్తానని తెలిపారు.
ఆనాటి కాలంలో నేను, నా భర్త మాత్రమే మొక్కలు నాటేవారం. అప్పుడు ఇంత సౌకర్యాలు (టెక్నలజీ) లేవు అన్నారు. కానీ ఇప్పుడు డబ్బు, సౌకర్యాలు ఉన్నప్పటికి మనుషుల్లో ప్రకృతిపై ప్రేమ తగ్గిపోతుందని తిమ్మక్క ఆవేదన వ్యక్తం చేసారు. అయినప్పటికి ఎక్కడో ఒక చోట చెట్లంటే ప్రేమున్న వాళ్లు ఉన్నారని, అందుకు జోగినిపల్లి సంతోష్ కుమారే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ స్పూర్తితో..జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న వృక్ష సేవ కోట్ల మందికి చేరడం అద్భుతమని ఆనందం వ్యక్తం చేసారు. అనుభవించడానికి అన్నీ ఉన్నా.. చెట్లపైన సంతోష్ కుమార్ కు ఉన్న ప్రేమ తన హృదయానికి తాకిందని తిమ్మక్క భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని ఇబ్బందులున్నా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆపోద్దని జోగినిపల్లి సంతోష్ కుమార్ దగ్గర మాట తీసుకున్నట్టు తిమ్మక్క తెలిపారు. అంతేకాదు, తన 111వ పుట్టిన రోజు జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ద్వారా అందిస్తున్న అవార్డును ఈ సంవత్సరం జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అందిస్తున్నట్టు తిమ్మక్క తెలిపారు.
తిమ్మక్క నిస్వార్ధతకు ముగ్ధుడైన కేసిఆర్.. మంచి వారికి మంచి జరుగుతుందనేందుకు తిమ్మక్కే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి తిమ్మక్క ప్రగతి భవన్ లో మొక్కను నాటారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పై ప్రముఖ కవి జూలూరీ గౌరీశంకర్ రాసిన “ఆకుపచ్చని వీలునామా” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యులు సంజీవోళ్ల రాఘవేంద్రతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.