రాష్ట్రంలో సహకార సంఘాల నిర్వహణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) నామినేటెడ్ పాలక మండళ్ల ద్వారానే పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో PACS ఎన్నికలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే సహకార సంఘాలకు పాలకవర్గాలను నియమించనున్నారు.
సంక్రాంతి లోపు అన్ని PACSలకు పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సహకార సంఘాల పనితీరులో వేగం పెరగడంతో పాటు పరిపాలనా స్థిరత్వం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల ఏర్పడే ఆలస్యం, వివాదాలను నివారించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం వివరిస్తోంది.
ప్రతి PACSకు మొత్తం 13 మందితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. సామాజిక సమతుల్యత దృష్ట్యా ఈ డైరెక్టర్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తప్పనిసరిగా మూడు స్థానాలను కేటాయించనున్నారు. దీంతో వెనుకబడిన వర్గాలకు సహకార సంఘాల నిర్వహణలో ప్రాతినిధ్యం లభించనుంది.
Also Read:అయ్యప్ప సన్నిధిలో 102 ఏళ్ల భక్తురాలు
అయితే, ఈ పాలకవర్గాల్లో సభ్యులుగా నియమించబడేందుకు సహకార సంఘాల్లో సభ్యత్వం కలిగిన రైతులకే అవకాశం కల్పించనున్నారు. బయటి వ్యక్తులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ విధానంతో నిజమైన రైతులకు పాలకవర్గాల్లో స్థానం దక్కి, సహకార సంఘాలు రైతుల సంక్షేమానికి మరింత సమర్థంగా పనిచేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

