రసవత్తరంగా మండలి పోరు..క్యాంపు రాజకీయాలు షురూ!

320
mlcs

స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 31న ఎన్నికలు జరగనుండగా మూడు స్ధానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాలో ఉంది. మరోవైపు కనీసం సిట్టింగ్ నల్గొండ ఎమ్మెల్సీ స్ధానంలో గెలిచి పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.దీంతో మండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నుండి టీఆర్ఎస్‌లోకి వలసలు రావడంతో అధికార పార్టీ మూడు స్ధానాలు గెలుచుకోవడం పక్కాగా కనిపిస్తోంది.

దీనికి తోడు పార్టీనేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. మూడు ఎమ్మెల్సీ స్ధానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపాలని నేతలకు సూచించారు.దీంతో ఆయా స్ధానాల్లో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గులాబీ నేతలు. రంగారెడ్డి లోకల్​బాడీ ఎమ్మెల్సీని సునాయాసంగా గెలుచుకుంటామని వరంగల్,నల్లగొండ సీట్లలో మాత్రమే పోటీ ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

దీంతో ఎంపీటీసీ,జడ్పీటీసీ,కౌన్సిలర్లతో టీఆర్ఎస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇక టీఆర్ఎస్‌కు దీటుగా లోకల్​ బాడీ ఓటర్లయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కాంగ్రెస్‌ రూ.2 లక్షల చొప్పున ఆఫర్​ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓటర్లెవరూ జారిపోకుండా సొంత పార్టీల నేతలకూ సొమ్ము ముట్టజెప్పి, క్యాంపులకు తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా స్ధానిక సంస్థల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.