తెలంగాణలో 2వేల కోట్లతో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ..

217

తెలంగాణ రాష్ట్రంలో మరొక భారీ పెట్టుబడి రానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ప్రస్తుతం మంచిర్యాలలోని దేవపూర్‌లో ఉన్న సీకే బిర్లా గ్రూపు తన సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించేందుకు సిద్ధంమైనది. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సియివో దీపక్ ఖేత్రపాల్ కలిశారు. ఈ సందర్భంగా కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రికి గురించిన ఆయన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మరియు పెట్టుబడి స్నేహ పూర్వక ప్రభుత్వ విధానాలను అభినందించారు.

ఇప్పటికే తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు మొదటి దశ పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను పొందినట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీశాఖ తుది అనుమతులు లభిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, ముఖ్యంగా పర్యావరణ శాఖ అనుమతులు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి లభించిన మద్దతును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కంపెనీ విస్తరణ కోసం సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఓరియంట్ సిమెంట్ సీఈవో ఖేత్రపాల్ తెలిపారు.

Minister KT Rama Rao

ఈ ప్లాంటు ద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉపాధితోపాటు పరోక్షంగా మరి 8 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. పర్యావరణ శాఖ తుది అనుమతులు లభించిన అనంతరం సుమారు మూడు నాలుగు నెలల్లో తాము నిర్మించబోయే ప్లాంట్ నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. నూతన ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదన సామర్థ్యం 7. 5 మిలియన్ టన్నులకు చేరుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకొని అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రంలోకి గత నాలుగు సంవత్సరాలలో వచ్చాయని, నూతన పెట్టుబడులతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు, సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నయని అనడానికి ఓరియంట్ సిమెంట్ విస్తరణ ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ప్రభుత్వ విధానాలపైన నమ్మకం ఉంచి, రెండు వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నందుకు మంత్రి కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కంపెనీ విస్తరణ ద్వారా సుమారు నాలుగువేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓరియంట్ సిమెంట్ కంపెనీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు టియస్ యండిసి, పరిశ్రమల శాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు టీఎస్. ఎం. డి. సి వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ ఉన్నారు.