అగష్టు 15 నాటికి రాష్ట్రమంత మిషన్ భగీరథ నీళ్లు..

289
Mission Bhagiratha
- Advertisement -

1947 అగష్టు 15 న బానిసత్వం నుంచి దేశం విముక్తి అయితే 2018 అగష్టు 15న అపరిశుభ్ర తాగునీటి సమస్యల నుంచి తెలంగాణ శాశ్వతంగా విముక్తి కావాలన్నదే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు స్వప్నం అన్నారు మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా భగీరథ పనుల్లో వేగం పెంచాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా తాగడానికి శుభ్రమైన నీళ్లు కూడా దొరకని ప్రజలకు, శుద్ది చేసిన నీటిని అందించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చరిత్రలో నిలిచిపోబోతున్నారన్నారు. ఇవాళ ఎర్రమంజిల్ లోని ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈలతో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా చీఫ్ ఇంజనీర్లుగా బాధ్యతలు చేపట్టిన 9 మంది అధికారులను ప్రశాంత్ రెడ్డి, స్మితా సభర్వాల్ అభినందించారు. ప్రజలందరికి సురక్షిత మంచినీటిని అందిస్తామని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. అనుకున్న సమయంలోపు పనులు పూర్తి కావడానికి, సమర్థ నిర్వహణ కోసమే ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) విభాగాన్ని పునర్వ్యవస్థీకరించామని చెప్పారు.

Mission Bhagiratha

ప్రజలకు సాధ్యమైనంత త్వరగా భగీరథ ఫలాలను అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) విభాగానికి కావాల్సినంత బలాన్ని, బలగాన్ని సమకూరుస్తున్నారని ఆయన అన్నారు. కొత్తగా చీఫ్ ఇంజనీర్లుగా బాధ్యతలు తీసుకున్నవారు హైదరాబాద్‌లో ఉండొద్దని, వాళ్లకు కేటాయించిన జిల్లాల్లోనే ఉండి పనులను నిరంతరం పరిశీలించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వేలాది గ్రామాలకు శుద్ది చేసిన నీరు బల్క్ గా సరాఫరా అవుతోందని, అయితే కొన్ని జిల్లాల్లో పనులు కాస్త నెమ్మదిగా అవుతున్నాయన్నారు. ఆ జిల్లాలపై (జనగాం,యాదాద్రి,ఖమ్మం,గద్వాల్,వనపర్తి,సిరిసిల్ల,మెదక్,మేడ్చల్,సంగారెడ్డి, సిద్దిపేట) ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ రోజు 50 గ్రామాలకు కొత్తగా నీటిని సరాఫరా చేస్తూ అగష్టు 14 అర్థరాత్రి కి రాష్ట్రంలోని చివరి ఆవాసానికి బల్క్ గా నీరు చేరాలని ఆదేశించారు.

పైన చెప్పిన పది జిల్లాల్లో బల్క్ సరాఫరాతో పాటు సమాంతరంగా ఇంట్రా పనులు పూర్తిచేసి ఇంటింటికి నల్లాతో నీటిని సరాఫరా చేయాల్సిందే అన్నారు. మైక్రో మేనేజ్‌మెంట్‌తో పనులు చేస్తే ఇదేం పెద్ద కష్టమైన పని కాదన్నారు. అగష్టు 15 నుంచి మిగిలిన జిల్లాల్లో ఇంట్రా పనులను మూడింతల వేగంతో చేయాలన్నారు. వారం రోజుల్లో ఇంట్రా పనులు ఎంట్రస్ట్‌మెంట్ పూర్తి చేసి అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు దొరకకపోతే ఆ వివరాలను గురువారం నాటికి ఈ.ఎన్.సికి అందించాలన్నారు. ఇంట్రా మెటీరియల్‌ను చీఫ్ ఇంజనీర్లే కొనుగోలు చేసేలా నిబంధనలు మార్చామన్నారు ప్రశాంత్ రెడ్డి.

Mission Bhagiratha

ఆ తర్వాత మాట్లాడిన ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) కార్యదర్శి స్మితాసభర్వాల్..పనులు వేగంగా చేయడంతో పాటు నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఫినిషింగ్‌తో పాటు క్యూరింగ్ బాగుండేలా చూడాలన్నారు. నాణ్యతను ఎప్పటికప్పుడు విజిలెన్స్ బృందాలతో తనిఖీ చేయించాలని చీఫ్ ఇంజనీర్ విజయపాల్ రెడ్డిని ఆదేశించారు. తాను కూడా ఫీల్డ్‌కు వస్తానని, పనులు జరిగే ప్రాంతంలోనే ఉంటానన్నారు స్మితా సభర్వాల్. సమస్యలను చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడొద్దన్నారు. కొత్త చీఫ్ ఇంజనీర్లు నూతన ఉత్సాహంతో పనిచేసి అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. దీన్ని ఆర్డర్‌గా కాకుండా అప్పీల్‌గా చూడాలన్నారు. చివరగా మాట్లాడిన ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, అగష్టు 15 వరకు ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) విభాగంలో సెలవులను రద్దు చేస్తున్నామన్నారు. ఇంట్రాకు అవసరమైన మెటీరియల్ ను వందశాతం ఆర్డర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ అంతర్గత పైప్ లైన్ పనులు మొదలుకావాలన్నారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే తెలియచేయాలన్నారు.

ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) విభాగం కొత్త రూపు సంతరించుకుంది. సమర్థ నిర్వహణ కోసం ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) విభాగాన్ని పునర్వ్వవస్థీకరించాలని గురువారం నాటి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్పులు జరిగాయి. మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS&S) కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిలు పునర్వ్యస్థీకరణపై చర్చించారు. దానికి అనుగుణంగా కొత్తగా 9 మంది అధికారులకు చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. కొత్త చీఫ్ ఇంజనీర్ల పరిధి, పనులను నిర్దేశిస్తూ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Mission Bhagiratha

Mission Bhagiratha

- Advertisement -