అమ్మదారిలోనే తిరుగుబాటు జెండా ఎగురవేశారు తమిళనాడు ఆపధర్మముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. మంగళవారం రాత్రి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు ధ్యానం చేసిన పన్నీర్ .. శశికళపై ఆరోపణలు గుప్పించారు. తనచేత బలవంతంగా రాజీనామా చేయించి అవమానించారని మండిపడ్డారు.
ఇప్పటికే శశికళను ముఖ్యమంత్రిగా అంగీకరించమని సోషల్ మీడియా వేదికగా పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. శశికళను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు పన్నీర్ సెల్వానికి జై కొడుతున్నారు. వి ఆర్ విత్ యు అంటూ కామెంట్లు పోస్టుచేస్తున్నారు.అన్నాడీఎంకే చీలిపోయే అవకాశముందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లే కాదు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం పన్నీర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘పదవి గురించి భయపడట్లేదు. సెల్వంకు మద్దతుగా పదవి వదులుకోవడం గర్వకారణం. అమ్మ మాతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సెల్వంకు మద్దతిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడీఎంకే ఎమ్మెల్యే హరి ప్రభాకరన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. పన్నీరు మద్దతుదారులు, కార్యకర్తలు వందల మంది ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఎంజీఆర్ సినిమాలోని పాటలు ఆలపిస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికైనా చాలా ధైర్యంగా నిజాలు చెప్పినందుకు అభినందనలంటూ డీఎంకే ఎమ్మెల్యే జే అంబజగన్ ట్వీట్ చేశారు. అలాగే ఏఐఏడీఎంకే ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ కూడా తాను పన్నీర్ వెంటేనంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనను పదవి నుంచి తీసేసినా పన్నీర్‌తో ఉంటానని చెప్పారు. అమ్మ తమతోనే ఉందని, అమ్మను అభిమానించే, గౌరవించే ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని ట్వీట్ చేసి ఆకర్షించారు. అలాగే ఓ రాజ్యసభ ఎంపీ కూడా సెల్వానికి మద్దతిచ్చారు.