సినీ సెలెబ్రెటీస్ మాత్రమే కాకుండా..రాజకీయనేతలు కూడా సోషల్ మీడయాలో విపరీతమైన ఫాలోవర్లని సంపాధించుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కూడా సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ ట్విట్టర్, ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని రాష్ట్రపతి ఎన్నికల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేయనున్నారు.
అందుకే సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు మీరా కుమార్ పవిత్ర రంజాన్ రోజున ట్విటర్ ఖాతాను తెరిచారు. ఖాతా తెరిచిన 19 గంటల్లోనే ఆ ఖాతాకు 2,336మంది ఫాలోవర్లు చేరారు.
సోమవారం సాయంత్రం ట్విటర్ ఖాతాను తెరిచిన మీరా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్ చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికలపై తాజా సమాచారం కోసం తన ఫేస్‌బుక్ ఖాతాని ఫాలో అవ్వాలని తెలుపుతూ అదే రోజు రెండో ట్వీట్ చేశారు.
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్‌ను ప్రకటించిన అనంతరం కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్… 2013లో పార్లమెంటరీ సెషన్‌లో ప్రతిపక్ష నాయకులు మాట్లాడే సమయంలో స్పీకర్ మీరాకుమార్ ఏ విధంగా అడ్డు పడుతున్నారో చూడండి అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఐఎన్‌సీ ఇండియా ట్విటర్ ఖాతా ద్వారా మీరాకుమార్‌పై సుష్మాస్వరాజ్ పొగడ్తల వర్షం కురిపించిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికే అధికార కూటమి తమ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఎన్నికల నామినేషన్ చివరి రోజైన బుధవారం నాడు మీరాకుమార్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆమెకు తోడుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గేలు వెళ్లనున్నట్టు సమాచారం.
వీరితో పాటు మీరా కుమార్ అభ్యర్థిత్వానికి మద్ధతు పలుకుతున్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఐఎం తరఫున సీతారాం ఏచూరి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హాజరు కానున్నారు. జులై 24తో ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం యుగియనుండటంతో అదే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్న ఎలక్షన్ కమిషన్ 20న ఫలితాలు వెల్లడించనుంది.