హిమాలయ పర్వత ప్రాంతాల్లో చెలరేగిన భారీ కార్చిచ్చు నేపథ్యంలో భారత వైమానిక దళం (IAF) ‘ఆపరేషన్ పసిఫిక్’ పేరుతో విస్తృత సహాయక చర్యలు చేపట్టింది. సముద్ర మట్టానికి సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న అటవీ ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీలో చెలరేగిన అగ్ని ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఐఏఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. అత్యంత కఠిన భౌగోళిక పరిస్థితులు, తక్కువ దృశ్యమానత, ఎడతెరిపి లేకుండా వీచే ఈదురుగాలుల మధ్య కూడా హెలికాప్టర్లు సాహసోపేతంగా ఎగిరి దాదాపు 12 వేల లీటర్ల నీటిని మంటలపై కుమ్మరించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో మంటల తీవ్రత తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నాగాలాండ్‌లోని జుకో వ్యాలీలో అగ్ని ప్రమాదం సమయంలో చిక్కుకుపోయిన 30 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన బృందాలు, ఐఏఎఫ్ కలిసి సమన్వయంతో పని చేస్తున్నాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ పసిఫిక్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Also Read:సిట్ నోటీసులకు బదులిచ్చిన కేసీఆర్

