తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, ఎంపీ కీర్తి ఆజాద్ భారతీయ జనతా పార్టీ (BJP)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఎంసీ ఎంపీలను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలోకి లాక్కునేందుకు బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ను ప్రయోగిస్తోందని ఆయన ఆరోపించారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ భౌతిక దాడులకు దిగినా, చివరికి తన భద్రతను తొలగించినా సరే… తాను కానీ మమతా బెనర్జీకి నమ్మకస్థులుగా ఉన్న ఏ ఎంపీ కానీ బీజేపీ బెదిరింపులకు లొంగబోరని ఆజాద్ స్పష్టం చేశారు.
తమ అసమ్మతి జాబితాపై సంతకం చేయడానికి నిరాకరించిన టీఎంసీ ఎంపీలపై బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఎంపీల ఇళ్ల వెలుపల పోలీసులను మోహరించి వారి కుటుంబాలను బెదిరిస్తున్నారని…భయాందోళనలు సృష్టించేందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు.
సంతకాలు చేయని ఎంపీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు….. బీజేపీ నాయకులు వారి ఇళ్లలో కూర్చోగా బయట పోలీసులు కాపలా ఉంటున్నారు. పలువురు ఎంపీల ఇళ్లను కూల్చివేసి, ధ్వంసం చేశారు అని ఆజాద్ ఆరోపించారు.
మొదటిసారి ఎంపీగా గెలిచిన బాపి హల్దార్ ఇల్లును పూర్తిగా కూల్చివేయడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆయన ఆ జాబితాపై సంతకం చేయాల్సి వచ్చిందని ఆజాద్ వివరించారు. మరో నూతన ఎంపీ మిథాలీ బాగ్ కూడా ఇటువంటి ఆస్తి నష్టాన్ని వేధింపులను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ నేత నిషికాంత్ దూబే నివాసం నుంచే నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ
తమ దారికి తెచ్చుకునే క్రమంలో కేంద్ర అధికారులు తన వ్యక్తిగత భద్రతను, హోంగార్డులను తొలగించారని కీర్తి ఆజాద్ వెల్లడించారు. నా సెక్యూరిటీని తొలగించి నన్ను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇలాంటి నీచమైన వ్యూహాలకు నేను లొంగను. కష్ట సమయాల్లో పారిపోయే ఎలుకలం కాము మేము. దీదీ (మమతా బెనర్జీ) మా కోసం ఎంతో చేశారు, ఆమెకు మేము ద్రోహం చేయలేము అని ఉద్ఘాటించారు.

