వరుస భూకంపాల వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టంతో అతలాకుతలమైన వెనిజులా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం భారీ సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ సహాయక మిషన్‌కు భారత్ ఆపరేషన్ అమిస్తాద్ అని పేరు పెట్టింది. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే ‘స్నేహం’ అని అర్థం. భారత వైమానిక దళానికి చెందిన రెండు సి-17 (C-17) గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు ‘భీష్మ క్యూబ్స్’ , అత్యవసర వైద్య సామాగ్రితో వెనిజులాకు బయలుదేరినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
వెనిజులాలో బుధవారం కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 235 కి చేరింది, మరియు 1,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంప అనంతర సహాయక చర్యల కోసం అత్యవసర సామాగ్రితో భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 విమానాలు ఈరోజు వెనిజులాకు బయలుదేరాయి. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ‘ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్’ తో పాటు 35 టన్నుల కంటే ఎక్కువ సహాయక సామాగ్రి, మందులు మరియు వైద్య పరికరాలు ఉన్నాయి. ఇందులో రెండు భీష్మ క్యూబ్స్ కూడా ఉన్నాయి. ఈ కష్టకాలంలో వెనిజులా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు భారతదేశం కట్టుబడి ఉంది అని జైశంకర్ పేర్కొన్నారు.
భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి ’60 పారా ఫీల్డ్ హాస్పిటల్’ కు చెందిన ఒక వైద్య బృందం ఈ రెండు విమానాలలో వెనిజులాకు బయలుదేరింది. ఈ బృందంలో 9 మంది మెడికల్ ఆఫీసర్లతో సహా మొత్తం 41 మంది సిబ్బంది ఉన్నారు. భూకంప బాధితులకు అత్యవసర వైద్య సంరక్షణ, ట్రామా మేనేజ్‌మెంట్, ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్సలు మరియు ఇతర అవసరమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఈ బృందం పూర్తి సన్నద్ధతతో వెళ్తోంది.
వెనిజులా చరిత్రలో శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 మరియు 7.5 తీవ్రతతో రెండు వినాశకరమైన భూకంపాలు సంభవించాయి. భవనాలు కుప్పకూలడంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వెనిజులాను ఆదుకునేందుకు భారతదేశంతో పాటు అమెరికా, చిలీ, బొలీవియా, బ్రెజిల్, అర్జెంటీనా, మరియు మెక్సికో వంటి పలు దేశాలు సహాయాన్ని ప్రకటించాయి.

