వినాయక చవితి పర్వదినం సందర్బంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వినూత్న ఆలోచన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ప్రతి గల్లీలో వినాయకున్ని ప్రతిష్టించేబదులు ఒకే చోట వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతేగాదు సిద్దిపేట వ్యాప్తంగా మట్టి గణనాథులనే ప్రతిష్టించాలని ప్రజలను కోరారు.
గల్లీకో వినాయకుడిని ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ఇలాంటి సమస్యలను అదిగమించాలంటే వినాయక మంటపాలను మితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ఏక వినాయక మహోత్సవం అనే పేరుపెట్టారు.
హరీష్ పిలుపునకు మంచి స్పందన వచ్చింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఒకటే మట్టి వినాయకుడి విగ్రహం ఊరంతటికి పెట్టాలని తీర్మానించింది. ఇదే బాటలో అన్ని గ్రామాలు నడుస్తున్నాయట.
వినాయకుడి పండుగ వస్తే చాలు పల్లెలు పట్నాల్లో గల్లీకి ఒకటి చొప్పున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వందల సంఖ్యల వినాయకులు కొలువుదీరుతాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ప్రమాదకర రసాయనాలు కలిపిన రంగులు వాడడం వల్ల నిమజ్జనం తర్వాత చెరువులు కలుషితమై చేపలు చనిపోయి, ఆ సాగునీటితో పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో మట్టి గణనాథులనే ప్రతిష్టించాలనే డిమాండ్ అందరి నుంచి వస్తోంది.