ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో ప్రకటన చేసింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ మౌళికసదుపాయాల కల్పన కోసం సుమారు లక్ష కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా మంత్రి సీతారామన్ ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం చేపడుతామని.. గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధిని కేటాయించబోతున్నామని తెలిపారు. దీర్ఘకాలిన వ్యవసాయ మౌళికసదుపాయాల కోసం స్వల్ప కాలిక పంట రుణాలపై దృష్టి పెట్టినట్లు మంత్రి నిర్మలా పేర్కొన్నారు.
మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రం భారీ ప్యాకేజీ కేటాయింది. సముద్ర, ఆక్వా, చేపల చెరువుల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. మెరైన్, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ కోసం 11వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చెయిన్స్, మార్కెట్ల కోసం మరో 9 వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.