తెలంగాణ సాధించిన స్ఫూర్తితో హరిత భావజాలం వ్యాప్తి చేస్తాం: ఎంపీ సంతోష్

181
mp santhosh
- Advertisement -

ప్రత్యేక రాష్ట్రం సాధనకు తెలంగాణ భావజాల వ్యాప్తి ఎలా ఉపయోగపడిందో, అలాగే రాష్ట్రాన్ని పర్యావరణ పరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశమంతటా హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపించచేస్తామని ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఒక్క రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం అన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నీ సిద్దమౌతున్నాయని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు అందరు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల చైర్మన్లు, గ్రామ స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ పిలుపు నిచ్చారు. కేసీయార్ ను అభిమానించే అందరితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగం ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

ఈ నెల 16, 17 రోజుల్లో రెండు రోజుల పాటు శంషాబాద్ విమానాశ్రమంలో హైదరాబాద్ చేరుకునే ప్రయాణీకులు అందరికీ ఔషధ మొక్కలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున పంపిణీ చేస్తామన్నారు. పల్లె ప్రగతి ద్వారా స్వచ్చమైన, పచ్చని గ్రామాలు సాధించాలని ప్రతీ గ్రామానికి ఒక సర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్ లాంటి సౌకర్యాలను ముఖ్యమంత్రి అందించారని తెలిపారు. ఈ సౌకర్యాలకు సార్థకత ఉండాలంటే ప్రతీ గ్రామం, తద్వారా రాష్ట్ర ఆకుపచ్చగా తయారుకావాలని, అందుకోసం అందరి కృషి అవసరమని సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. ఎండలు సమీపిస్తున్నందున మొక్కలు నాటడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు, నీటి సౌకర్యం, తగిన రక్షణ కల్పించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎంపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -