రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల రోజు అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్. ఈంసందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగిసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2.80కోట్ల మంది ఓటర్లున్నారని చెప్పారు. పోలింగ్‌కేంద్రాల్లో నిఘావ్యవస్థను పటిష్టం చేశామని.. ఇంటర్నెట్ అందుబాటులోఉన్న కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను లైవ్‌లో చూసేలా సదుపాయం కల్పిస్తున్నామన్నారు.ఇప్పటివరకూ 77 నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని, రేపటి వరకూ అన్ని నియోజకవర్గాల ముద్రణ పూర్తవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకూ రూ.105 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తుసామగ్రిని సీజ్‌చేసినట్టు తెలిపారు.
తాజాగా, కొడంగల్ నియోజవర్గంలో రూ .51 లక్షలు ఐటీశాఖ దాడుల్లో పట్టుబడ్డాయన్నారు. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులన్నింటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం పెంచడానికి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.