నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పురాతన భవనం సరాయి బిల్డింగ్ కూలిపోయింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దాదాపు వందేళ్ల చరిత్ర గల ఈ నాంపల్లి సరాయి విశ్రాంతి భవనాన్ని ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1919లో 5,828 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, ఇతర అవసరాలకు వివిధ గ్రామాలు, పట్టణాల నుండి వచ్చేవారి సౌకర్యార్థం ఈ సరాయిను నిర్మించారు. 2011లో ఈ భవనాన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించారు.
నగరంలోని నిరుపేదలకు జిహెచ్ఎంసి అందిస్తున్న ఐదు రూపాయల భోజన పథకం మొదటి కేంద్రాన్ని ఈ నాంపల్లి సరాయిలోనే ప్రారంభించారు. కాగా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు ఈ కూలిన భవన సంఘటన స్థలం వద్దనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ శిథిలాలను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.