సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరో కమల్ హాసన్ ఈ షో చేస్తుండగా అల్రెడీ ప్రారంభమైంది. తెలుగులో రేపటి నుంచి ఈ షో ప్రారంభంకానుంది. తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అక్కడ ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది.
కమల్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రెండో వారం నుంచినే డివైడ్ టాక్ ను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి అక్కడ ఈ కార్యక్రమంపై వివాదాలు మొదలుకావడం విశేషం. ఈ కార్యక్రమంలో తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో కమల్ హాసన్ పై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు కొంతమంది. అయితే వాటిని లెక్క చేయనని కమల్ అంటున్నాడు. అయితే తమిళ బిగ్‌బాస్ వ్యూయర్స్ ను ఆకట్టుకోలేకపోతోందనే మాట వినిపిస్తోంది. టీఆర్పీలో ఈ కార్యక్రమం బాగా వెనుబడిందని అంటున్నారు.
దీంతో తెలుగులో ప్రారంభంకానున్న బిగ్ బాస్ షోపై ఇప్పుడు అందరి కన్నుపడింది. అయితే, టాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొంతమంది ఎన్టీఆర్ బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించడాన్ని పునరాలోచించుకోవాలని కోరడం నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే, తమిళ బిగ్ బాస్ షో మాదిరిగానే తెలుగులో ఎన్టీఆర్ చేసే షో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.
సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 ని.లకు.. శని, ఆది వారాలలో రాత్రి 9గంలకు ఈ కార్యక్రమం స్టార్ మాలో ప్రసారం కానుంది. 60 కెమెరాలు, 70 రోజులు, 12 మంది సెలబ్రిటీస్ తో కలిపి భారీ స్థాయి లో ప్లాన్ చేస్తున్నారు.ఈ షో కోసం తారక్ కి దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ ఒక్క సీజన్ కి ఇస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టీవీ షోస్ అన్ని హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి. కానీ తెలుగు బిగ్ బాస్ షోకి దేశ వ్యాప్త ఆదరణ దక్కేలా ముంబైలో షూట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాలు ప్రకారం సదా, స్నేహ, రంభ, మంచు లక్ష్మీ , ప్రముఖ మత ప్రచారకుడు కేఏ పాల్, ఆలీ, మధు శాలిని తదితరులు పాల్గొననున్నారని టాక్. ఈ షో మొదలయితే ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి మరి.