నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది..? బాలయ్య-క్రిష్ జోడి మరోసారి హిట్ కొట్టిందా లేదా చూద్దాం…
కథ:
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. ఎన్టీఆర్ సినీ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు అన్నది ఎవరికి తెలియదు. ఆ విశేషాలన్నీ యన్.టి.ఆర్: కథానాయకుడులో చూస్తాం. బసవతారకం(విద్యాబాలన్) క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి హరికృష్ణ(కల్యాణ్‌రామ్) తీవ్ర ఆందోళనకు గురవడంతో సినిమా ప్రారంభమవుతుంది.. ఎన్టీఆర్(బాలకృష్ణ) బాల్యం ఏంటి? ఆయన ఎలా ఎదిగారు? సినిమాల్లో ఎలా రాణించాడు? అన్నదే కథానాయకుడు కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ఎన్టీఆర్ గెటప్‌లు,ఎన్టీఆర్-ఎఏన్నాఆర్ ఫ్రెండ్ షిప్,ఎన్టీఆర్-బసవతారకం సన్నివేశాలు,మాటలు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపించడం అంత సులభం కాదు. ఆ విషయంలో క్రిష్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించింది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి మలుపు కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఒదిగిపోయాడు. విభిన్న గెటప్‌ల్లో కనిపించారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. బసవతారకంగా విద్యాబాలన్ పాత్రకు ప్రాణం పోసింది. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. మిగితా నటీనటులందరూ తమ పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆహ్లాదాన్ని పంచారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ నిడివి ఎక్కువగా ఉండటం. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కనిపించిన సన్నివేశాలు అంతగా అతకలేదేమోననిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా ఓ అద్భుతం. భవిష్యత్ తరాలకు ఎన్టీఆర్ ఓ చరిత్ర పాఠంలా మిగిలిపోయేలా సినిమాను తెరకెక్కించారు. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బుర్రా సాయిమాధవ్ రాసిన మాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎడిగింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
ఎన్టీఆర్ చరిత్రను సినిమా తీయాలన్నది ఓ ఊహ. అలాంటి సినిమాను కథగా ఎంచుకుని దానిని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా
తెరకెక్కించడంలో వందకు వందశాతం సక్సెస్ సాధించాడు దర్శకుడు క్రిష్. కథ,మాటలు,ఎన్టీఆర్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్స్. దివిసీమ ఉప్పెన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు, గుండెలను మెలి తిప్పేలా చూపించాడు దర్శకుడు. మొత్తంగా సంక్రాంతి రేసులో మొదటి సినిమాగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు చరిత్రలో నిలిచిపోయే మూవీ.
విడుదల తేదీ:09/01/19
రేటింగ్:3/5
నటీనటులు:బాలకృష్ణ, విద్యాబాలన్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి