ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్

11
- Advertisement -

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2023, హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. “కళావేదిక” (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ గారి పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, మురళి మోహన్ గారు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్ లో నేను కూడా స్పాన్సర్ గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదిక తో పాటు రాఘవే మీడియా మధు గారు భాగమవడం. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం. కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ గారి ఖ్యాతి పెంచాలని, వాటిలో నేను నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నందమూరి మోహన్ రూప గారు మాట్లాడుతూ : తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి తెలుగువారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన గారు మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

Also Read:పచ్చిపాలు..ఆ సమస్యలు దూరం!

- Advertisement -