వచ్చే ఏడాది ఎన్టీఆర్ జీవిత చరిత్ర,విశేషాలతో తీసే సినిమా వస్తుందని నటసింహం నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే నటిస్తున్నాని ప్రకటించిన బాలకృష్ణ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాడు. గౌతమి పుత్రశాతకర్ణి విజయం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే పూరి ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో నటించే పాత్రలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలోని పాత్రలపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మూవీలో ఏఎన్నార్‌కు ఓ ప్రధాన పాత్ర ఉంది. ఎన్టీఆర్-ఏఎన్నాఆర్ కలిసి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేసినా.. నిజజీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చెప్పాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఎంతో ఆప్యాయంగా ఉండే మిత్రులు.
అందుకే ఎన్టీఆర్ బయోపిక్ అంటే.. అందులో కచ్చితంగా ఏఎన్నార్ ఉండాల్సిందేనని, ఏఎన్నార్ లేని ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఒకవేళ సినిమాలో ఏఎన్నార్ పాత్రను జోడిస్తే.. ఆ పాత్రను పోషించేది ఎవరు అన్న ప్రశ్నలు వేస్తున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తున్నాడు కాబట్టి ఏఎన్నార్ పాత్రను ఆయన వారసుడు అక్కినేని నాగార్జున పోషిస్తేనే బాగుంటుందని అంటున్నారట. వాళ్లిద్దరూ కలిసి నటిస్తే ఇండస్ట్రీలోని రెండు ప్రముఖ కుటుంబాల నుంచి మరోసారి మల్టీస్టారర్ సినిమా రావడం తథ్యమని వారు చర్చించుకుంటున్నారట. మొత్తంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం కాకముందే సినిమాపై రోజుకోవార్త టీ టౌన్‌లో హల్ చల్ చేస్తోంది.
తెలుగు సినీరంగాన్నిదశాబ్దాలపాటు ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు జీవం పోసి.. అసలు దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించారు. కేవలం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం హస్తగతం చేసుకుని దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎందరో యువకులు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. రాజకీయ దిగ్గజాలను మట్టికరిపించారు. బడుగు జీవుల సంక్షేమమే పరమావధిగా తపించిన ఎన్టీఆర్ ప్రజల వద్దకే పాలన ఉండేలా చర్యలు చేపట్టారు. పేదల కోసం కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్‌ది.