కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతమని ఎన్నారై టీఆర్ఎస్ యుకే నాయకులు అన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్ రావుతో కలిసి ఎన్నారై టీఆర్ఎస్ బృందం సందర్శించింది. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న ఆరవ ప్యాకేజీ టన్నెల్ మరియు రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎత్తిపోతల వ్యవస్థ పనిచేసే తీరును అక్కడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ని అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఎంతో పట్టుదలతో ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తునారన్నారు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో పనులు చేస్తుండడం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సాగు నీటి, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్రం అతి వేగంగా అభివృద్ధి పథానికి వెళుతుందన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో తెలంగాణ వేగంగా బంగారు తెలంగాణగా మారతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ బృందంలో ఎన్నారై టీఆర్ యస్ యూకే అధ్యక్షులు అనీల్ కూర్మాచలం, సభ్యులు అశోక్ దూసరి,నవీన్ రెడ్డి,,శ్రీకాంత్ జెల్ల ,మల్లేష్ పప్పుల ,సత్య చిలుముల, మరియు స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాజేష్ ఉన్నారు.