‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్రానిదే- NRI TRS

314
NRI TRS Anil Kurmachalam Slams BJP
- Advertisement -

పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే టిఆర్‌ఎస్ పార్టీ ఉపేక్షిందని, తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటంబంలా భావించే కేసీఆర్ ఎవరికీ నష్టం కలిగినా రాజీలేని పోరాటం చేసే గొప్ప ఉద్యమ వీరుడని, ఎవరూ సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వ వైఖరిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎలాగైతే ద్వంద వైఖరిని అవలంబించిందో, నేడు కృష్ణా జలాల వివాదంపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నాయకులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని అనిల్ కూర్మాచలం ఫైర్‌ అయ్యారు. ఇప్పటికే కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్‌ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ భేటీ అయ్యారని, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేశారని, ఏపీ కొత్త ప్రతిపాదనల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై వివరణ ఇచ్చారని, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై ఫిర్యాదుపాటు న్యాయపరంగా పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికి నాటి నుండి నేటి వరకు పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలదేనని, నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దేశమంతటా ఇదే సమస్యఉందని, బాధ్యత కేంద్రం పైన ఉంటే చిత్తశుద్ధితో పరిష్కరించకుండా రాష్ట్రాల మధ్య వైరం పెంచుతున్నారని, ఏ రాష్ట్రం చూసుకున్న ఎదో ఒక నదీ జలాల సమస్య ఉందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లీలో కాకుండా ఢిల్లీలో కొట్లాడాలని అనిల్ కూర్మాచలం హితవు పలికారు.నాడు తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, అలాగే తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి కేసీఆర్ పిలుపిస్తే ఏ పోరాటానికైనా ఎన్నారై టిఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

- Advertisement -