సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన టెక్ నిపుణుడు గూడూరు మధుకర్ రెడ్డి (37) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తల్లికి ‘డియర్ మదర్, కైండ్లీ ఫర్ గివ్ మీ’ (అమ్మా దయచేసి నన్ను క్షమించు) అని మెసేజ్ పెట్టాడు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలోని భువనగిరిలో ఉంటుండగా, కొడుకు ఆత్మహత్య గురించి నిన్న సమాచారం అందింది. మధుకర్ నాలుగు నెలల క్రితమే ఇండియాకు వచ్చి వెళ్లాడని, ఆర్థికంగా అతని కుటుంబం మంచి స్థితిలోనే ఉందని, ఎప్పుడూ తిరిగి ఇండియాకు వచ్చి, ఇక్కడే పని చేసుకుంటానని చెబుతుండే వాడని, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని మధుకర్ బంధువు దుర్గా రెడ్డి తెలిపారు. మధుకర్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని అన్నారు.
యాదగిరిగుట్ట మండలం రాళ్ళ జనగాం గ్రామానికి చెందిన గూడురు బాల్ రెడ్డి, సుగుణ దంపతుల కొడుకు మధుకర్ రెడ్డి. చదువు కోసం మధుకర్ రెడ్డి 14 ఏళ్ళ క్రితమే అమెరికాకు వెళ్ళాడు.ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళి అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకొంటూ ఉండిపోయాడు. ఏడేళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకొన్నాడు. ప్రస్తుతం వారికి నాలుగేళ్ళ కూతురు ఉంది.మధుకర్ రెడ్డి కాలిఫోర్నియాలో స్వంత ఇంట్లోనే ఉంటున్నాడు.