కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటి నుంచీ నల్లధనం ఏదో రూపంలో బయటకు వస్తుంది. నల్లకుబేరులకు గుండెల్లో పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు దాచుకున్న కోట్ల నల్లధనాన్ని ఏం చేయాలో తెలీక డబ్బు కట్టల్ని చించి పారేస్తున్నారు, కాల్చేస్తున్నారు. చెత్తకుండీలో పడేస్తున్నారు. మహారాష్ట్రలోని పుణెలో చెత్తకుండీలో రూ. 52,000 విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లను పారిశుధ్య కార్మికురాలు గుర్తించిన సంగతి తెలిసిందే.
ఇక ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని మీర్జాపూర్ వద్ద నదిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రద్దు చేసిన 500, వెయ్యి రూపాయాల నగదును పారేశారు. కొంత నగదును కాల్చి గంగానదిలో వేశారు. మరికొంత నగదును కాల్చివేయడం సాద్యం కాకపోవడంతో నేరుగా నదిలోవేశారు.
తాజాగా అస్సోంలోని ఓ నదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3.5 కోట్ల నగదును చించి పారేశారు. చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు స్థానిక భరాలు నది సమీపంలోని నారెంగి రైల్వేస్టేషన్ డ్రెయిన్‌లో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అస్సోంలోని చందన్‌నగర్, రుక్మిణిగావ్ ప్రాంతాల్లో చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు డ్రెయిన్‌లో లభ్యమయ్యాయి. ఈ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవి నిజమైనవా నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.