రూ.2.5 ల‌క్ష‌లు విత్ డ్రా చేసుకోవ‌చ్చు..

186
- Advertisement -

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు చిల్లర కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత దాస్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… వివాహ వేడుక‌ల కోసం గుర్తింపు కార్డు చూపి రూ.2.5 ల‌క్ష‌ల రూపాయ‌లు విత్ డ్రా చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. అలాగే గుత్త వ్యాపారులు వారానికి బ్యాంకుల నుంచి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి త‌మ అకౌంట్‌లో ప‌డిన లోన్ల నుంచి రైతులు వారానికి 25,000 రూపాయల వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని దాస్ తెలిపారు.

shaktikant-das-1477462454

పాత కరెన్సీని మార్చుకునే పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2,500కు తగ్గిస్తున్నట్టు.. మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వేలిపై సిరా పెట్టడం మొదలైన తరవాత, ఒకసారి వచ్చిన వారు వెంటనే మళ్లీ రాకుండా చేయడంతో పాటు అత్యధికులకు నోట్లను మార్చుకునే అవకాశాన్ని దగ్గర చేసినట్లయిందని ఆయన అన్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని వ్యాఖ్యానించిన ఆయన, అప్పుడు తిరిగి ఈ మొత్తాన్ని పెంచుతామని అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్పు రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్లకు పాన్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. తమ ఖాతాలకు పాన్‌కార్డ్ నంబర్ సమర్పించని ఖాతాదారులు రూ.50 వేలకు మించి డిపాజిట్ చేస్తుంటే… ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధనకు అనుగుణంగా తప్పనిసరిగా పాన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకోవాలని ఆర్‌బీఐ కోరింది. ఈ నిబంధన కింద అమల్లోకి వచ్చే అన్ని రకాల లావాదేవీలకు పాన్ నంబర్ సమర్పించాలంటూ ఖాతాదారులను కోరాలని సూచించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతవారం నిర్ణయం తీసుకున్న తర్వాత పాత నోట్లను ప్రజలు తమ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో జమ చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

hindustan-resolution-currency-narendra-online-november-rupees_6f3039fe-a806-11e6-8311-ecdc6071292f

మరోవైపు బ్యాంకుల్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. తెల్లవారక ముందే డబ్బుల కోసం ఏటీఎం, బ్యాంకుల ముందు లైన్లు కడుతున్నారు. ఇక బ్యాంకు వాళ్లు ఇస్తున్న రూ. 2000 నోటుకు చిల్లర దొరక్క సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం నుంచి బ్యాంకు ముందు 4,500 రూపాయల పాత కరెన్సీని మార్చుకునేందుకు వచ్చిన ఓ వయోవృద్ధుడు, తనకు 2 వేల కాగితాన్ని ఇవ్వబోగా… వద్దనీ తిరస్కరించాడు. మీడియా అక్కడే ఉండడంతో బ్యాంకు సిబ్బంది అతనికి రూ. 100 నోట్లను ఇచ్చి పంపారు. ఆపై ఆయన మాట్లాడుతూ, తాను ఉదయం నుంచి బ్యాంకు దగ్గరే ఉన్నానని, మూడు గంటల పాటు నిలబడితే, ఈ డబ్బులు దొరికాయని, వీటిని పొలంలో పనిచేస్తున్న కూలీలకు పంచాల్సి వుందని చెప్పాడు. తనకు ఇంకా డబ్బు కావాలని, మరోసారి వచ్చి పాత నోట్లను మార్చుకోవాల్సి వుందని, రేపు తిరిగి వస్తానని తెలిపాడు.

 

- Advertisement -