ఇండియా కూటమి జోరు తగ్గిందా?

31
- Advertisement -

సాధారణంగా ఎన్నికల ముందు పొలిటికల్ పార్టీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు బహిరంగ సభలు, పర్యటనలు నిర్వహిస్తు పోలిటికల్ హిట్ పెంచుతుంటారు పార్టీల నేతలు. కానీ అధికారమే లక్ష్యంగా ఉన్న ఇండియా కూటమి వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వంటి పేరుమోసిన పార్టీలు కూడా ఉన్నాయి. అయితే కూటమిగా ఏర్పడే ప్రారంభం లో నానా హడావిడి చేసిన నేతలు సరిగ్గా ఎన్నిక ముందు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను లిక్కర్ స్కాం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా కేజ్రీవాల్ అనుకున్న రీతిలో ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అడపా దడపా బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పటికి అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ కు మైలేజ్ తెచ్చిన రాహుల్ గాంధీ.. అదే రీతిలో భారత్ న్యాయ్ యాత్ర ద్వారా ఆధారణ తీసుకురావడంలో విఫలం అవుతున్నారు.

ఇక తృణమూల్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల విషయంలో ఎదురైన విభేదాల కారణంగా మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమితరుపున ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. ఇలా అగ్రనేతలు ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కూటమిలో జోరు తగ్గిందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అటు మూడోసారి అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. దాంతో ప్రచార విభాగంలో కమలం పార్టీ దూసుకుపోతుంటే.. హస్తం పార్టీ మాత్రం నానా అగసట్లు పడుతోంది. మరి ముందు రోజుల్లోనైనా ఇండియా కూటమి ప్రచారంపై గట్టిగా దృష్టి సారిస్తుందేమో చూడాలి.

Also Read:KTR:రైతులంటే ఎందుకంత చిన్నచూపు?

- Advertisement -