ఎనిమిది మంది నటీనటులకు ఒకేసారి కోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి ఈ నటులపై కోర్టు నోటీసులు జారీ చెయ్యడమేంటని అందరూ షాక్ కు గురయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎనిమిది మంది నటీనటులకు ఒకేసారి కోర్టు నోటీసులు జారీ కావడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. వీరులో ఏడుగురి పై నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఒకరిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. వీరిలో ప్రముఖ నటీనటులు ఉండటం గమనార్హం.
తమిళ స్టార్ హీరో సూర్య, సీనియర్ నటులు శరత్ కుమార్, సత్యరాజ్, వివేక్, విజయ్ కుమార్, దర్శకురాలు శ్రీప్రియ, నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చేరణ్ లపై వారెంట్లు జారీ అయ్యాయి.నీలగిరి జిల్లా కోర్టు వీరిపై వారెంట్లు జారీ చేసింది. జర్నలిస్టుల సంఘం ఫిర్యాదు మేరకు కోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ నటీనటులు పాత్రికేయులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది.ఇది 2009 నాటి వ్యవహారం అని తెలుస్తోంది.
నడిగర్ సంఘం సమావేశం లో మాట్లాడుతూ ఈ నటీనటులంతా జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అవమానించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పాత్రికేయులు కోర్టుకు ఎక్కారు. విచారణ కొనసాగుతోంది. ఈ నటీనటులెవ్వరూ కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కేసును విచారించిన కోర్టు వారెంట్లు జారీ చేసింది.