సాగర్‌లో భగత్‌ గెలుపు ఖాయం..!

103
bhagath
- Advertisement -

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. సాగర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ఊరూరా, ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రవినాయక్ అయితే బోరున ఏడుస్తూ, ప్రజల కాళ్ల మీద పడి వెక్కెక్కి ఏడుస్తూ సింపతీ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు సాగర్‌లో జానారెడ్డికి ఎడ్జ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.కాని ఎప్పుడైతే సీఎం కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ యాదవ్‌‌ను అభ్యర్థిగా ప్రకటించారో…సాగర్‌లో పొలిటికల్ సీన్ పూర్తిగా టర్న్ అయింది. జానారెడ్డికి వయసైపోయిందని, కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని, యువకుడు, విద్యావంతుడు అయిన భగత్‌కు ఓటేస్తే అభివృద్ది కొనసాగుతుందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం సాగర్ ప్రజల్లోకి బాగా వెళుతోంది.

నోముల నర్సింహయ్య మీద అభిమానంతో ఈసారి ఆయన కుమారుడికే ఓటేయాలని సాగర్ ప్రజలు ఫిక్స్ అయ్యారని టాక్. అయితే కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి గెలుపు కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒక్క పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మరే కాంగ్రెస్ నేత జానాకు మద్దతుగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు బీజేపీకి ఎలాగూ గెలిచే సీన్ లేదని సాగర్‌లో చర్చ జరుగుతోంది. సాగర్‌లో అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీకి దెబ్బేసిన సీఎం కేసీఆర్ ప్రచారంలో సైతం పక్కా ప్రణాళిక ప్రకారం టీఆర్ఎస్ నేతలను పరిగెత్తిస్తున్నారు. అంతే కాదు తాను స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14 న లేదా 15న అనుములలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే హాలియాలో నెల్లికల్లుతో సహా 9 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో బీజేపీ, కాంగ్రెస్‌ల కుటిల రాజకీయాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.కాంగ్రెస్ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టారు. బీజేపీ నేతలను బండకేసి బాదారు.

తాజాగా ఈ నెల 17న సాగర్ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15 న సాయంత్రం ప్రచారం బంద్ కానుంది. అందుకే 14 వ తేదీన సీఎం కేసీఆర్ సాగర్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలను మరోసారి తనదైన శైలిలో దుమ్ముదులపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలతో కించపరుస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌ను, ఆ పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఉతికారేయనున్నట్లు సమాచారం. ఇఫ్పటికే సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు దిశగా పయనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత వార్‌ వన్ సైడ్ అవడం ఖాయమని సాగర్ టీఆర్ఎస్ వర్గాలు కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాయి. సాగర్‌లో సీఎం కేసీఆర్ మరోసారి ఎంట్రీ ఇవ్వనుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి.

- Advertisement -