లోకేశ్ యువగళం.. జోష్ నిల్ ?

36
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోంది. అధినేత చంద్రబాబు మరియు తనయుడు నారా లోకేశ్ నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో నిమగ్నమైఉన్నారు. చంద్రబాబు రోడ్ షోలు పర్యటనలు చేస్తూ బిజేగా ఉంటే.. లోకేశ్ యువగళం పాదయాత్రతో బిజీగా ఉన్నారు. అయితే చంద్రబాబు రోడ్ షో లలో కనిపించినంత జనం.. లోకేశ్ పాదయాత్రలో కనిపించడంలేదు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికే 20 రోజులు పూర్తి అయినప్పటికి.. ఇంతవరకు పూర్తి స్థాయిలో ప్రజలను ఆకర్షించడంలో లోకేశ్ ఇంకా తడబడుతూనే ఉన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యువగళం పై టీడీపీ బాగా హైప్ క్రియేట్ చేసింది. .

హైప్ కు తగ్గట్టుగానే పాదయాత్ర మొదటి రోజున టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున హాజరై అందరి దృష్టి పాదయాత్రపై పడేలా చేశారు. ఇక మొదటి రోజు లోకేశ్ తన స్పీచ్ లో కాస్త కొత్తదనం చూపిస్తూ.. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను తెరపైకి తెస్తూ.. తాము అధికారంలోకి వస్తే 35 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. కౌలు రైతులకు మెరుగైన చట్టం తెస్తామని, ఎస్సీ, ఎస్టీ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని.. ఇలా హామీలు ఇచ్చిన లోకేశ్ ఆ తరువాత.. రోజులు గడిచే కొద్ది ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గుప్పించడానికే అధిక సమయం కేటాయిస్తున్నారు.

అయితే అధికార పార్టీపై విమర్శలు చేయడం వల్ల టీడీపీ క్యాడర్ లో జోష్ పెరుగుతున్నప్పటికి.. జనాలకు మాత్రం కాస్త విసుకు తెప్పించే అంశమే. అంతేకాకుండా పాదయాత్రలో భాగంగా వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు కూడా ట్రోల్స్ కు గురౌతున్నాయి. దాంతో లోకేశ్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు జనాలు కూడా ఊహించిన రీతిలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. మొత్తానికి నారా లోకేశ్ చేపట్టిన యువగళం ఈ 20 రోజుల్లో చప్పగానే సాగిందని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం అయి కేవలం 20 రోజులు మాత్రమే అయింది.. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. మరి ముందు రోజుల్లో యువగళం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -