జీఎస్టీ పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌సభలో శుక్రవారం ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన నిర్మలా… పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సహా సహజ వాయు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని చెప్పారు.
రాష్ట్రాలు కూడా ప్రాతినిథ్యం వహిస్తున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటివరకూ ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎవరూ సిఫార్సు చేయలేదని చెప్పారు. ఆదాయ ప్రభావాల అంచనా సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఐదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌పరిశీలించవచ్చని వ్యాఖ్యానించారు.
పెట్రో ధరలు రికార్డుస్ధాయికి చేరి సామాన్యుడికి భారమైన క్రమంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారనే వార్తల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ప్రతిఒక్కరినీ నిరాశపరిచింది.