సినీ నటుడు అక్కినేని నాగార్జున వైసీపీ అధినేత వైఎస్ జగన్తో భేటీకావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. నాగ్ వైసీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు నాగర్జున.
తాను జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. వైఎస్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే కలిశానని తెలిపారు. తానకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఎవరి సీటుకోసమో రికమెండ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. జగన్ పాదయాత్ర ఇటీవల ముగిసిందని అన్ని వేల కిలోమీటర్లు పాతయాత్ర చేయడం మాములు విషయం కాదన్నారు. పాదయాత్ర సక్సెస్ కావడంతో అభినందించేందుకే జగన్ని కలిశానని స్పష్టం చేశారు.
కొంతకాలంగా నాగార్జున వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం లోటస్పౌండ్లో జగన్తో నాగ్ భేటీ కావడం పుకార్లకు తెరలేపింది. తన భార్య అమల లేదా సన్నిహితుడికి గుంటూరు ఎంపీ సీటు కేటాయించాలని కోరేందుకే జగన్ని కలిశారని ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు నాగ్.