హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగండ్ల, కేపీహెచ్‌బీ ఫేజ్-4, హుడా మియాపూర్‌ను ప్రారంభించిన కేటీఆర్…. సీఎం పిలుపుతో మేరకు అనుకున్నదానికంటే ముందుగానే ప్రాజెక్టులను పూర్తి చేశామని వెల్లడించారు. సమైక్యపాలనలో పవర్ కట్,తాగునీటి సమస్య ఉండేది ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు.
56 రిజర్వాయర్లలో 46 రిజర్వాయర్లను రానున్న రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. రాబోయే రోజుల్లో రహదారులు,మూసిని అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగపర్చేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేస్తుందని చెప్పారు.అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, ఉప్పల్, ఎలబీనగర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు కలిపి 10 మున్సిపల్ సర్కిళ్ల ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రూ. 1900కోట్ల హడ్కో నిధులతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. నిత్యం 750 మిలియన్ లీటర్ల సరఫరాతో లక్ష కనెక్షన్లు, దాదాపు 50 లక్షల మందికి మెరుగైన నీటి సరఫరాయే లక్ష్యంగా 1700 కిలోమీటర్ల పైపులైన్, 56 చోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్ల పనులకు శ్రీకారం చుట్టింది. తొలి ఫలాలను నేడు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సర్కిల్ వాసులకు అందించి ప్రాజెక్టు కల సాకారం చేసింది.
రానున్న రోజుల్లో దశల వారీగా రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకువచ్చి దాదాపు వెయ్యి కాలనీలు, బస్తీలకు రోజూ నీళ్లతో జలసిరులు అందించనున్నారు. నడి వేసవిలో సమృద్ధిగా నీటి సరఫరాను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి వద్దకే వెళ్లి నల్లా కనెక్షన్లు మంజూరు చేస్తుండడంపై విశేష స్పందన వక్తమౌతుంది.