ప్రాజెక్టుల్లేక కడలిపాలు..

37
Modi
- Advertisement -

7.2 కోట్ల ఎకరాలకు సరిపోయే నీరు వృధా
గోదావరి నుంచి 6వేల టి.ఎం.సి.లు వృధా
కృష్ణానది నుంచి 1200 టి.ఎం.సి.లు వృధా
వంశధార నుంచి 113టి.ఎం.సి.లు వృధా

దేశానికే కాకుండా ప్రపంచానికే అన్నంపెట్టగలిగిన వనరులు భారతదేశంలో ఉన్నాయని కృష్ణా, గోదావరి నదులు మరోసారి నిరూపించాయి. కానీ వెలకట్టలేని వేలాది టి.ఎం.సి.ల నదీ జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు దాటినప్పటికీ నదీ జలాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోకపోవడం మూలంగా నదుల నీళ్ళల్లీ సముద్రం పాలవుతున్నాయంటే ప్రభుత్వాల చేతగాని తనమేననే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. గోదావరి, కృష్ణానదుల నుంచి ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 7,200 టి.ఎం.సి.ల నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిసాయి. ఇక దేశంలో ఉన్న 405 నదుల నుంచి ఇంకెంత పరిమాణంలో నీరు కడలిలో కలిసిపోయిందో అర్థం చేసుకోవాలని పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోని 405 నదులలో సుమారు 72 వేల టి.ఎం.సి.ల నీరు అందుబాటులో ఉంది. కానీ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలకు పక్కా ప్రణాళిక లేకపోవడం మూలంగా నదుల నీళ్ళల్లీ సముద్రంలో కలుస్తూ వృధా అవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోనే నీటిపారుదల ప్రాజెక్టులను భారీగా నిర్మించుకొంటూ నదుల నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తోందని ఆ ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. “అమ్మ పెట్టదు, అడుక్కో నివ్వదు” అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించదు, నిర్మించుకునే తెలంగాణ వంటి ప్రభుత్వాలకు సహకరించదు… తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ లు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెట్టడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఎవ్వరికీ అర్ధంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీవ నదులుగా ప్రఖ్యాతిగాంచిన గోదావరి, కృష్ణానదుల నుంచి ఈ వానాకాం సీజన్లో ఎడతెరిపి లేకుండా అన్ని ప్రాజెక్టుల క్రెస్ట్ గేట్లు ఎత్తి అదనపు నీటిని బయటకు విడుదల చేయాల్సి వచ్చింది. అలా గోదావరి నది నుంచి గడచిన జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ రికార్డుస్థాయిలో 6003 టి.ఎం.సి.ల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది. ఈ నీటిని మొత్తాన్ని సద్వినియోగం చేసుకుంటే గోదావరి బేసిన్ పరిధిలో ఏకంగా ఆరు కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చునని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.

ఎందుకంటే ఒక్క టి.ఎం.సి.ల నీటిని పది వేల ఎకరాల మాగాణి భూములకు సాగునీటిని సరఫరా చేసే ఇరిగేషన్ నియమ నిబందనల మేరకు లెక్కిస్తే 6003 టి.ఎం.సి.ల నీటిని ఆరు కోట్ల ఎకరాల మాగాణి భూములకు సాగునీటిని సరఫరా చేయవచ్చునని వివరించారు.అదే విధంగా కృష్ణానది నుంచి ఈ వానా కాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 1200 టి.ఎం.సి.ల విలువైన చెబుతున్నాయి. ఈ నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటే ఒక కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసే అవకాశాలుండేవని ఆ అధికారులు వివరించారు. చివరకు ఉత్తరాంధ్రలోని వంశధార నది నుంచి ఈ సీజన్లో 113 టి.ఎం.సి.ల నీరు వృధా అయ్యింది. కృష్ణానది నీటిని కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి తెలంగాణలోని జూరాల, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజి వరకూ, అదే విధంగా గోదావరినది నీటిని మహారాష్ట్రలోని జైక్వాడ్, తెలంగాణలోని శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి దిగువన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దవళేశ్వరం బ్యారేజి వరకూ ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కలిపి కేవలం 763 టి.ఎం.సి.ల నీటినిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ కృష్ణా, గోదావరి నదులల్లో మొత్తం సుమారు 7,600 టి.ఎం.సి.ల నీరు ప్రవహించిందని ఆ అధికారులు వివరించారు.

అంటే కేవలం 400 టి.ఎం.సి.ల నీటిని మాత్రమే గోదావరి, కృష్ణానదుల భాగస్వామ్య రాష్ట్రాల్లోని ప్రజలు వినియోగించుకొన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కనీసం మరో వెయ్యి టి.ఎం.సి.ల నీటినిల్వ సామర్ధ్యంతోనైనా కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకొన్నట్లయితే దేశానికి ఆహార కొరత సమస్య తీరేదని, ఆహార సమస్యలు ప్రపంచ దేశాల్లో కంటే ఇండియాలోనే ఆ సమస్య ఎక్కువగా ఉండటానికి కారణం దేశాన్ని పాలిస్తున్న రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమం పైన అవగాహన లేకపోవడం, పక్కా ప్రణాళికల్లేకపోవడమే ప్రధాన కారణమని అంటున్నారు. నీరు, విద్యుత్తు ఉంటే ఆటోమేటిక్ గా దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందనే ప్రాధమిక సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు విస్మరించినట్లున్నారని అంటున్నారు. దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేద్దామనే ధ్యాసే లేకపోవడం, ఎల్లప్పుడూ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడం, ఆయా ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమయం సరిపోతోందేగానీ దేశాన్ని వ్యవసాయం, జలవనరుల రంగాల్లో అభివృద్ధి చేసుకుంటే ఎలాంటి సంక్షోభాలు తలెత్తవనే అంశాలను కూడా కేంద్రప్రభుత్వ పెద్దలు విస్మరించినట్లున్నారనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే దేశాన్ని పాలిస్తున్న పెద్దలు అభివృద్ధివైపు దృష్టి సారించి రైతాంగానికి కనీస వసతులు కల్పిస్తే విమర్శలకు బ్రేకులు పడతాయని, లేకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని గుర్తిస్తే చాలు…అని అంటున్నారు.

- Advertisement -