రైతుల ఆందోళనలు.. సరిహద్దుల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత..

219
Farmers Protest
- Advertisement -

దేశ రాజధానిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు ఇంటర్‌నెట్ సేవలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద ఆదివారం రాత్రి 11 గంటల వరకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సరిహద్దులతో పాటు వాటికి ఆనుకుని ఉండే ఎన్సీటీ పరిసర ప్రాంతాల్లోనూ నిషేధం అమల్లో ఉంటుందని అందులో పేర్కొంది.

ఘాజీపూర్ సరిహద్దుల్లో ఫోన్ సర్వీసులనూ తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం 17 జిల్లాల్లో జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు ఇంటరనెట్ సేవలపై నిషేధం విధించింది. కాగా, రైతు సంఘం నేతలు శనివారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సద్భావన దినాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రోజంతా నిరశన దీక్ష చేస్తున్నారు.

ఇక 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఢిల్లీకి చేరుకున్న రైతులు బారికేడ్లను తోసి ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పాటు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. మరోవైపు చారిత్రక ఎర్రకోటకు చేరుకున్న ఆందోళనకారులు అక్కడ జెండాలను పాతడం కలకలం రేపింది.

- Advertisement -