ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా నటించిన `ఉన్నది ఒకటే జిందగీ` హిందీ డబ్బింగ్ వెర్షన్ `నెం.1 దిల్ వాలా` యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ సాధించి నెట్టింట్లో హల్ చల్‌గా మారింది. గతంలో హిందీలో విడుదలైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాకపోవడం గమనార్హం.
ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మనీష్ షా విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ సాధించడం పట్ల హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మనీష్ షా ఆనందం వ్యక్తం చేశారు.
కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన `ఉన్నది ఒకటే జిందగీ` స్నేహం విలువను చెప్పే అందమైన ప్రేమ కథా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలిసి వదులుకున్న అబ్బాయి కథ. స్నేహితులుగా రామ్, శ్రీ విష్ణు నటించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియదర్శి, కిరీటి దామరాజు అల్లరిమాటలు నవ్వులు పంచాయి.
స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ ,లావణ్య త్రిపాఠి నాయికలుగా నటించారు. రామ్, అనుపమ, శ్రీవిష్ణు ,లావణ్య నటన, స్నేహం విలువ చెప్పిన కథ, కథనం, దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి.