నిజామాబాద్ Constituency కహానీ..

350
- Advertisement -

నిజామాబాద్ పార్లమెంట్ స్ధానం తెలంగాణలోని 17పార్లమెంట్ లోక్ సభ స్ధానాల్లో ఒకటి. ఈ నిజామాబాద్ పార్లమెంట్ స్ధానం 1952వ సంవత్సరంలో ఏర్పడింది. ఇక ఈనిజమాబాద్ జిల్లాకు పెద్ద చరిత్రే ఉంది. నిజామాబాద్ ను పూర్వం ఇందూరు లేదా ఇంద్రపురి అని పిలిచేవారు. ఈ నిజమాబాద్ నగరం తెలంగాణలోని అతిపెద్ద నగరాల్లో మూడవ స్ధానంలో ఉంది. నిజామాబాద్ ను 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజలు ఏలిన సంస్ధానాల్లో ఇప్పటికి చారిత్రక కట్టడాల ఆనవాళ్ళ్లు దర్శనమిస్తాయి.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద మరియు సారంగాపూర్ మొదలైనవి ఉన్నాయి. దక్షిణ కాశిగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి దేవాలయం కూడా ఈపార్లమెంట్ పరిధిలోనే ఉంది. ప్రముఖ రచయిత డా.కేశవరెడ్డి. రాయలసీమలో జన్మించిన ఈయన, జిల్లాలోని డిచ్‌పల్లిలో స్థిరపడి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్ లు కూడా నిజామాబాద్ లోనే జన్మించారు. మంజీరా, గోదావరి నదులు ఈ జిల్లా నుంచే ప్రవహిస్తాయి. చారిత్రాత్మక కట్టడాలకు కూడా ఈపార్లమెంట్ సెగ్మెంట్ ప్రసిద్దిగాంచిందిగా చెప్పుకోవచ్చు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు పెంపొందించేందుకు 2006లో నిజామాబాదు జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంగా తెలంగాణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో వీక్షించే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. నీలకంఠేశ్వర ఆలయం, సారంగపూర్ హనుమాన్ మందిరం, తిలక్ గార్డెన్, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజాం సాగర్ ప్రాజెక్ట్‌, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాద్ కోట, డిచ్ పల్లి రామాలయం ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధి గుండా సికింద్రబాద్ నుంచి నాందేడ్ వరకూ రైలు మార్గం కూడా ఉంది. కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది.

ఈనిజామాబాద్ పార్లమెంట్ స్దానానికి ఆనుకుని పెద్దపల్లి, కరీంనగర్, మెదక్ పార్లమెంట్ స్ధానాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా అంటే ఎక్కువగా పసుపు, ఎర్రజొన్నలు ఎక్కువగా పండిస్తారు. వాటితో పాటు వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, శనగ వంటి పంటలను పండించడంతో పాటు కూరగాయల సాగు కూడా పెద్ద మొత్తంలో చేస్తారు. అంతే కాకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈపార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఈనిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 27రెవెన్యూ మండలాలు, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ మూడు రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా నిజమాబాదు జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 36 పాత మండలాలు నుండి 17 మండలాలు విడగొట్టి కామారెడ్డి జిల్లాను కొత్తగా ఏర్పడింది.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 1952లో తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హెడ హరిశ్చంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1957,1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హరిశ్చంద్రారెడ్డి మరోసారి విజయం సాధించారు. 15సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు హరిశ్చంద్రారెడ్డి. ఆ తర్వాత 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి ఎం.ఎన్ రెడ్డి విజయం సాధించారు. ఎం.ఎన్ రెడ్డి 1967 నుంచి 1971 వరకూ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1971, 1977,1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్. రామ్ గోపాల్ రెడ్డి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. తర్వాత 1984, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాండుర్ బాల గౌడ్ రెండు పర్యాయాలు గెలుపోందారు. ఆతర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గడ్డమ్ గంగా రెడ్డి విజయం సాధించారు.

మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు తిరుగులేని నిజమాబాద్ పార్లమెంట్ గడ్డపై తొలిసారిగా టీడీపీ జెండాను ఎగురవేశారు గడ్డం గంగారెడ్డి. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆత్మచరణ్ రెడ్డి గెలుపొందారు. ఆత్మచరణ్ రెడ్డి 1996 నుంచి 1998వరకూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1998,1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గడ్డం గంగా రెడ్డి మరో రెండుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మధుయాష్కి గౌడ్ రెండు సార్లు విజయం సాధించారు. మధుయాష్కి గైడ్ 2004 నుంచి 2014 వరకూ నిజామాబాద్ ఎంపీ సేవలందించారు.

తెలంగాణ రాష్ట్ర్రం వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది మధుయాష్కి గౌడ్ పై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత గెలుపొందారు. మొట్టమెదటి సారిగా నిజామాబాద్ గడ్డపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో మరోసారి నిజామాబాద్ లోక్ సభ స్ధానంలో గులాబీ జెండా ఎగురనుందనడంతో సందేహం లేదు. ఇక కాంగ్రెస్ ను నిజామాబాద్ లో అభ్యర్దులు కూడా దొరకడం లేదు. దీనికి తోడు ప్రస్తుత ఎంపీ కవిత అక్కడ చేసిన అభివృద్ది పనుల కారణంగా ఇక్కడ ప్రజలు మరోసారి గులాబి జెండాకే పట్టం కట్టనున్నారు.

- Advertisement -