నితీశ్ కుమార్..ఆస్తులెంతో తెలుసా?

8
- Advertisement -

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఆస్తి వివరాలను బహిర్గతం చేశారు. సీఎం‌తో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించగా, ఈ సమాచారాన్ని క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం తాజాగా విడుదల చేసింది.

అధికారిక వివరాల ప్రకారం, నితీశ్ కుమార్‌కు ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బీహార్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.48 కోట్లు. తన వద్ద రూ.20,552 నగదు ఉన్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాట్నా సెక్రటేరియట్ ఖాతాలో రూ.27,217, ఢిల్లీలోని ఎస్‌బీఐ పార్లమెంటరీ హౌస్ ఖాతాలో రూ.3,358, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాలో రూ.27,191 ఉన్నట్లు తెలిపారు.

ఇక తన వద్ద రూ.11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ.2.03 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం మొత్తం చరాస్తుల విలువ రూ.17.66 లక్షలుగా వెల్లడించారు.

అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు మంత్రులు కూడా తమ ఆస్తి వివరాలను బహిర్గతం చేశారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వద్ద నగదు, బ్యాంకు డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, వాహనాలు ఉన్నట్లు తెలిపారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తన బ్యాంకు సేవింగ్స్, షేర్లు, బంగారు ఆభరణాల వివరాలను వెల్లడించారు. ఈ ఆస్తి ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:KTR:కాంగ్రెస్ పాలనలో మార్పు లేదు..తిరోగమనమే

 

- Advertisement -