జనసేన ఎంట్రీతో 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే జనసేన తన పార్టీ కేడర్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో జనసేన కార్యక్రమాలను షురూ చేశారు. చురుకైన కార్యకర్తల కోసం జల్లెడ పడుతున్నారు పవన్ కళ్యాణ్.
ఇప్పటికే అన్న చిరంజీవిచే స్థాపించబడి దివాళా తీసిన ప్రజారాజ్యం పార్టీ సంగతి అంత త్వరగా మరిచిపోనట్టున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే కాబోలు తమ పార్టీ కేవలం యుక్తవయస్సులో వున్న నిజాయితీపరుల్ని, కమిటిమెంట్ వున్నవాళ్లని మాత్రమే తీసుకుంటుందని, ఇప్పటికే రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న సీనియర్లను తీసుకోబోమని చెప్పారు. అలా చెప్పినట్లుగానే ఆయన గ్రౌండ్ వర్క్‌లో భాగంగా. నిత్యం రాజకీయాల్లో చురుకుగా వుండే యువకుల్ని ఎంపిక చేసుకుంటున్నారని తెలిసింది.
ఏపీలో స్వయంగా తానే రంగంలోకి దిగనున్నట్టు పవన్ ఇంతకుముందే ప్రకటించాడు. మరి తెలంగాణలో జనసేనానిని నడిపించేదెవరన్న ప్రశ్న ఇప్పడు పవణ్ కళ్యాణ్ అభిమానులను వెంటాడుతోంది. ఇదిలాఉండగా సోషల్ మీడియాలో తెలంగాణ జన సేనాని అతనే అన్న వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆయన ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్ వీర భక్తుడు.. హీరో.. నితిన్ అని ప్రచారం జోరుగా సాగుతోంది. నితిన్‌పై వార్తలు రావడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి.
నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అతిపెద్ద ఫ్యాన్. పవన్‌ను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ చిన్నప్పటి నుంచి పవన్నే దేవుడిగా కొలిచాడు. ఇదే విషయాన్ని నితిన్ కూడా అనేక సార్లు మీడియాతోను పంచుకున్నాడు. స్టేజ్‌ల మీద పవన్‌పై భక్తిని చాటుకున్నాడు. ఇటు సినిమాల్లోను పవన్‌ను నితిన్ అనుకరిస్తూ వస్తున్నాడు. ఇష్క్ సినిమాతో మొదలు పెట్టి చిన్నదాన నీకోసం వరకు సినిమాల్లో పవన్‌ను అనుకరించాడు. ప్రతి సినిమాలో పవన్ కు సంబంధించిన విషయం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
పవన్ కూడా నితిన్‌పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తాడు. పవన్ పోలంలో పండిన మామిడి పండ్ల కోసం టాలీవుడ్లో చాలా మంది సినీ ప్రముఖులు ఎదురు చూస్తుంటారు. కాని ఒకసారి నితిన్‌కు పవన్ పండ్లు పంపి సర్ ప్రైజ్ చేశాడు పవన్. ఇక మెగాహీరోల ఈవెంట్లకు హాజరు కాని పవన్.. నితన్కు సంబంధించిన ప్రతి సినిమా ఈవెంట్లోను కనిపిస్తాడు.
ఆ అభిమానంతోనే ఇపుడు తెలంగాణ జనసేన భాద్యతలు నితిన్‌కు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే నితిన్ తెరవెనుకే ఉండి తెలంగాణ భాద్యతల్ని నిర్వహిస్తాడట. పార్టీకి అధ్యక్షుడిగా పవన్ చెలామణి అవుతుందే కానీ… నడిపించే కథ మొత్తం నితినే కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు నడుస్తాయట. ఏపీలోనే పూర్తి దృష్టి సారించాలనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. తన పార్టీని ఇటు తెలంగాణ, అటు ఏపీలో పటిష్టం చేసేందుకు ఇలా పక్కా ప్రణాళిక రచించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం వుందో తెలియాలంటే, కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే.